వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ముంపు నష్టం ఎక్కువగా ఉందని ఆరోపించారు. వేలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న వరి పొలాలు దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నారని చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో వేసిన వరి, కంద, పసుపు, అరటి, మినుము, పెసర పంటలు నీటమునిగాయని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బాధితులకు ఆహారం, వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చినరాజప్ప కోరారు.