తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవో ఆదిత్యపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది. గిరిజనులను కింద కూర్చోబెట్టి అవమానించారని ఆగస్టు 25న తెదేపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. ఈ అంశంపై తీసుకున్న చర్యలపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
తప్పుడు కేసులపై ఆందోళన.. ఆ రోజు ఏం జరిగిందంటే..
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో పలువురిపై తప్పుడు కేసులు పెట్టిన ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ నాయకులు ఆగస్టు 24వ తేదీన ఆందోళనకు దిగారు. కంగల శ్రీనివాసు, కారం రంగారావు, కత్తుల ఆదిరెడ్డి, కడబాల రాంబాబు తదితరులు ఐటీడీఏ ముట్టడి చేపట్టారు. ఏఎస్పీ కరణం కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ప్రధాన కూడళ్లలో ఉంటూ ఆందోళనకు వచ్చేవారిని అడ్డుకున్నారు. ముట్టడికి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మద్దతిచ్చారు. ర్యాలీ చేసి అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఐటీడీఏ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. పోలీసుల చొరవతో 20 మందితో చర్చించేందుకు పీవో అనుమతించారు. డిమాండ్లపై సరిగా స్పందించకపోవడంతో వారంతా బయటకు వచ్చి నిరసన తెలిపారు.
నేలపై కూర్చోబెట్టి అవమానించారు..
ఆదివాసీలతో చర్చలకు పిలిచిన ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య తనతోపాటు ఆదివాసీ నాయకులను నేలపై కూర్చోబెట్టి అవమానించారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ఈ ఘటనపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్నుదొరలు ఎన్హెచ్ఆర్సీకి ఆగస్టు 25న లేఖ రాశారు.
ఇదీ చదవండి
CM JAGAN: ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్