ప్రజలకు సమర్థంగా సేవలు అందాలి. పాలన సౌలభ్యంగా వెలగాలి. అభివృద్ధి సమాంతరంగా సాగాలి. ప్రగతి పర్యవేక్షణ పక్కాగా ఉండాలి. ఇదే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. కాకినాడ కేంద్రంగా ఇప్పుడున్న తూర్పు గోదావరి జిల్లా భవిష్యత్తులో మూడు జిల్లాలుగా మారనుంది. అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ దిశగా కసరత్తు చురుగ్గా సాగుతోంది. గతంలో విభజన ప్రక్రియ భౌగోళిక, జనాభా ప్రాతిపదికన జరిగితే.. ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలే హద్దులుగా జిల్లాలు రూపొందనుండటం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి కల్లా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వీలుందనే వాదనల నేపథ్యంలో ప్రాథమిక వనరుల కల్పనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు యంత్రాంగం దృష్టిసారించింది.
జిల్లాలో 64 మండలాల్లో 54 లక్షల మంది జనాభా ఇప్పుడున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే మండలాల సంఖ్య 74కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా కమిటీ ఇప్పటికే పలుమార్లు సమీక్షించింది. ప్రాథమికంగా జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల నివేదిక శనివారం రాత్రికి పంపింది. నివేదిక జిల్లా కేంద్రం నుంచి కాకుండా కీలక శాఖల వారీగా డివిజన్ల వారీగా ప్రత్యేక లాగిన్ ఇచ్చి.. అప్‌లోడ్ చేసే ఏర్పాటు చేశారు. వీటిని ప్రభుత్వం పరిశీలించాక భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు వచ్చే ఏడాది జనవరి నెలలోపే జరగవచ్చనే వాదన వినిపిస్తోంది. కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడిన జనాభా గణన మళ్లీ మొదలైతే జిల్లాల పునర్విభజనపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున ఈ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే జిల్లాలు ఏర్పాటుచేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అందుబాటులో ఉన్న వనరులు ఏంటి? ఎక్కువ సమయం దొరికితే శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలేంటి..? అనేదే నివేదిక రూపంలో అందిస్తున్నట్లు చెబుతున్నారు.
కాకినాడ పార్లమెంటు పరిధి కొత్త జిల్లాగా ఆవిర్భవించనుంది. ఇప్పటికే ఇక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. పాలనా సౌలభ్యం కోసం కొన్ని కార్యాలయాలు రాజమహేంద్రవరానికి తరలించారు. జిల్లాల పునర్విభజన జరిగితే కాకినాడలో పలు కీలక శాఖల జిల్లా కార్యాలయాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. జిల్లా పేరును తూర్పుగోదావరిగా ఉంచుతారా..? కాకినాడగా మారుస్తారా..? ఇంకే పేరేదైనా ఖరారు చేస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.
రాజమహేంద్రవరం.. తూ.గో.జిల్లాలో నాలుగు, ప.గో. జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో కలిపి జిల్లాగా ఏర్పాటు కానుంది. ఇక్కడ ప్రస్తుతం 58 ప్రభుత్వ శాఖలకు 133 కార్యాలయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ కార్యాలయం, విజిలెన్స్, జిల్లా న్యాయస్థానం, పర్యాటక శాఖ, ఈపీడీసీఎల్, టెలికం, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్జేడీ, మున్సిపల్ ఆర్డీ, పట్టణ ప్రణాళిక ఆర్జేడీ, గనుల శాఖ, జలవనరుల శాఖ, ఆర్టీసీ ప్రాంతీయ తదితర జిల్లా స్థాయి కార్యాలయాలు ఉన్నాయి. మిగిలినవి ఏర్పాటు చేయాలి. నగరంలో 31.90 ఎకరాలు, గ్రామీణం, రాజానగరం పరిధిలో 87.93 ఎకరాల ఖాళీ భూములను గుర్తించారు. ధవళేశ్వరం జలవనరుల శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సి వస్తే వీటిని అందుబాటులోకి తెచ్చే వీలుంది. రాజమహేంద్రవరంలోని అయిదు ప్రభుత్వ అతిథి గృహాలతోపాటు ఖాళీ భవనాలను గుర్తించి నివేదించారు.
అమలాపురం జిల్లా కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడ కలెక్టర్, ఎస్పీ ఇతర కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ కొలిక్కివచ్చింది. కలెక్టరేట్‌కు అనుబంధంగా 36 కీలక శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నివేదిక రూపొందించారు. వెంటనే జిల్లా ఏర్పాటు చేయాల్సి వస్తే సబ్ కలెక్టర్ కార్యాలయం, ఇతర వనరులు వినియోగించుకోవాలనీ.. లేదంటే సమీకృత కలెక్టరేట్ పేరిట అయిదు ఎకరాల్లో నూతన భవనాలు నిర్మించాలనేది ఆలోచన. ఎస్పీ కార్యాలయానికి మూడు ఎకరాలు అవసరమని తేల్చారు. జిల్లా కార్యాలయాలన్నీ అమలాపురంలోనే ఏర్పాటవుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీగా ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలు, ఎంత విస్తీర్ణం, అద్దె భవనాలు.. సమగ్ర సమాచారం ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మొత్తమ్మీద వంద ఎకరాల వరకు ప్రభుత్వ భూములు గుర్తించారు. కీలక శాఖలు, వాటి అవసరాలకు అయిదు ఖాళీ స్థలాలు, రెండు అతిథి గృహాలు గుర్తించారు. వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, మత్స్య శాఖ, తూనికలు- కొలతల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండగా వీటికి సొంత భవనాలు సమకూర్చాలి.
-
ప్రాథమిక నివేదిక కొలిక్కి..
కొత్త జిల్లాల కసరత్తులో భాగంగా వివరాల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వానికి భవనాలు, భూములు, కార్యాలయాలకు పంపాల్సిన ప్రాథమిక నివేదిక అంశాలు నమోదుచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్‌లో మొత్త్తం శాఖలు 285 చూపిస్తుంటే.. శనివారం రాత్రికి జిల్లాలో అందుబాటులో ఉన్న 89 శాఖల వివరాల నమోదు పూర్తయింది. మొత్తం కార్యాలయాలు 1,127గా పోర్టల్‌లో చూపిస్తుంటే.. జిల్లాలో 190 కార్యాలయాల వివరాలు నమోదు చేశారు.
ఖాళీ భూమి 145.60 ఎకరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, మిగిలిన 57.20 ఎకరాల్లో మాత్రం చిక్కులు ఉన్నట్లు పేర్కొన్నారు.
భవనాలు 190, ప్రాంతీయ కార్యాలయాలు 12, జిల్లా కార్యాలయాలు 29, డివిజనల్ కార్యాలయాలు 73, సబ్ డివిజనల్ కార్యాలయాలు 34, మండల కార్యాలయాలు 49 ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు.
ఇదీ చదవండి:
విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు!