వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో టీకా కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీకా కేంద్రాలకు వచ్చిన వందల మంది భౌతిక దూరం పాటించకుండా.. గుంపుగా ఉన్న తీరు వైరస్ వ్యాప్తికి దారి తీసేలా ఉంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా ఇవాళ 32 కేంద్రాలలో 13,250 మందికి కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆయా కేంద్రాలకు వందల సంఖ్యలో జనం తరలి వచ్చారు. అయితే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో భౌతిక దూరం పాటించే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. కరోనా వ్యాప్తికి స్వాగతం పలికినట్లు అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిరోజుల ముందు వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలల్లో టీకా ఇచ్చేవారు. అయితే పదిహేను రోజులుగా పాఠశాలల్లోని కేంద్రాల వద్ద కాకుండా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద వ్యాక్సిన్ వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రోజువారిగా వచ్చే రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
త్వరలో కొవిడ్ థర్డ్ వేవ్ ఉద్ధృతి మొదలవుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ విశాలమైన ప్రదేశాలు, భవనాల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.