జానపద సాహిత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ జానపద విజ్ఞాన సదస్సును సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య గంగారావు, వంగపండు ప్రసాదరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
జానపద సాహిత్యాన్ని కాపాడుకుందాం.. యువతకు అందిద్దాం - రాజానగరంలో జాతీయ జానపద విజ్ఞాన సదస్సు
'జాతీయ జానపద విజ్ఞానం- ప్రపంచీకరణ ప్రభావం' అనే విషయంపై వంగపండు ప్రసాదరావు తన జానపద గేయాలతో ఆలరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నన్నయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జానపద విజ్ఞానం ప్రపంచీకరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులు పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆ జానపదాల్లో కొన్నింటిని మీరూ వినండి.. ఆనందించండి.
‘జానపద విజ్ఞానం-ప్రపంచీకరణ ప్రభావం’ అనే అంశంపై దక్షిణ భారతీయ జానపద విజ్ఞాన పరిషత్తు, తెలుగు జానపద విజ్ఞాన పరిషత్తు సహకారంతో నిర్వహిస్తున్న సదస్సుకు ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీరమేష్ అధ్యక్షత వహించగా తెలుగు విభాగాధిపతి తరపట్ల సత్యనారాయణ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రామీణ పదాలతో గేయాలు పాడుతూ గజ్జె కట్టి అలరించారు. ప్రపంచీకరణ కారణంగా గ్రామీణ సాహిత్యం దిగజారిపోతోందని తెలిపారు. జానపదం ప్రజలను నిత్యం చైతన్యవంతుల్ని చేస్తుందని పేర్కొన్నారు. తన గానం నుంచి వచ్చిన ‘జజ్జనక జనక’ ఉత్తరాంధ్రలో పుట్టి 20 భాషల్లో అనువాదమై ప్రాచుర్యం పొందిందన్నారు. విశేష ప్రాచుర్యం పొందిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా..’ పాట నేపథ్యాన్ని వివరిస్తూ గజ్జెకట్టి గేయాన్ని ఆలపించారు. అనంతరం సదస్సు నిర్వాహకులు అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందించారు.
ఇదీ చదవండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ