జిల్లాలోని 62 మండలాలు, 1,069 పంచాయతీలు, 2,808 ఆవాసాల పరిధిలో 6,29,949 మందికి ఉపాధి జాబ్ కార్డులున్నాయి. వీరి పరిధిలో 47,173 శ్రమశక్తి సంఘాలున్నాయి. ఈనెల 1 నుంచి 25వ తేదీ వరకూ 9,73,000 పని దినాలు కల్పించారు. వీటిలో 2,22,000 పని దినాలకు రూ.4.81 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.15.50 కోట్ల మేర వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 1.70 లక్షలకు పైగా కూలీలు పనులకు హాజరౌతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.59 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం సగటు వేతనం రూ.223 చెల్లిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఖరీఫ్ సాగు మొదలయ్యే వరకూ పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
వీటికి ప్రాధాన్యం
క్లస్టర్ల పరిధిలో రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నారు. కాలువలు, చెరువుల్లో పూడికతీత, నీటి సంరక్షణ పనులు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువైనా ఇప్పటి వరకు పని ప్రదేశంలో మజ్జిగ పంపిణీ చేపట్టలేదు. మంచినీళ్లు మాత్రమే ఇస్తున్నారు. కొవిడ్-19 నిబంధనల్లో భాగంగా పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల పర్యవేక్షణ లోపంతో వీటి అమలు అంతంత మాత్రంగానే ఉంది.