Nara Lokesh Yuvagalam Padayatra: సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. పున:ప్రారంభమైంది. 76 రోజుల విరామం అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాటిపాక నుంచి నడకను ప్రారంభించారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు మద్దతుగా పెద్దఎత్తున తెలుగుదేశం నేతలు తరలివచ్చారు. టీడీపీ శ్రేణులకు పోటీగా జనసైనికులు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్లో నిర్వహించిన బహిరంగసభకు జనసంద్రం పోటెత్తింది. కోనసీమ నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు సభకు భారీగా హాజరయ్యారు. ఇరు పార్టీ శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాబలంతో సాగే యువగళం (Yuvagalam) ఆగదని లోకేశ్ తేల్చిచెప్పారు. యువగళం పాదయాత్రకు 76 రోజుల విరామం ఇచ్చినందుకు ప్రజల్ని క్షమాపణ కోరారు. యువగళం ప్రజాగళంగా మారిందని స్పష్టం చేశారు. చంద్రబాబుని చూస్తే సైకో జగన్‌కు భయమని.. అందుకే అక్రమంగా అరెస్ట్ చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు బెయిల్ ఆర్డర్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎంతలా నియంత్రించారో అర్ధమవుతుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ తేదీ ఖరారైందన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డిని 3 నెలల్లో ప్రజలు పిచ్చాసుపత్రికి పంపటం ఖాయమని ధ్వజమెత్తారు.
యువగళం జనగళమై! - పునః ప్రారంభమైన లోకేశ్ పాదయాత్రకు మద్దతు వెల్లువ
తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కేసులు ఎదుర్కోక తప్పదు: జగన్‌కు అవకాశం ఇస్తే.. పేదల కడుపు నింపిన అన్నా కాంటీన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు గండిపడిందని రేపో మాపో చంద్రబాబుపై కొత్త కేసు పెడతారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
వచ్చేది తెలుగుదేశం - జనసేన ప్రభుత్వమే: గడపగడపకు మన ప్రభుత్వం నుంచి ఏపీ నీడ్స్ జగన్ వరకు వైసీపీ చేస్తున్న అన్ని కార్యక్రమాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న లోకేశ్.. బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ చేసింది సామాజిక న్యాయం కాదు.. సామాజిక అన్యాయమని విమర్శించారు. వైసీపీ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటామన్న లోకేశ్.. వచ్చేది తెలుగుదేశం - జనసేన ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
ప్రజల కోసం దేనికైనా సిద్ధం: జగన్ బ్లూ బటన్ నొక్కి 10 రూపాయలు ప్రజలకు పంచుతూ.. మరో పక్క రెడ్ బటన్ నొక్కి వారి వద్ద నుంచి 100 రూపాయలు లాగేస్తున్నాడని విమర్శించారు. జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలనే జగన్ కోరుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా ఓర్చుకునేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు.
ప్రజాక్షేత్రంలోకి లోకేశ్- యువగళం పాదయాత్ర పునః ప్రారంభం
బాధితులకు లోకేశ్ భరోసా: బహిరంగసభ అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. 2014 జూన్ 27న జరిగిన ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్‌లో 22 మంది చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారని.. అప్పటి టీడీపీ ప్రభుత్వ చొరవతో ఒక్కొక్కరికి 25 లక్షలు పరిహారం అందిందని గుర్తుచేశారు. గెయిల్ యాజమాన్యం.. బాధితులు, గ్రామస్థులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని లోకేశ్‌కు వివరించారు.