తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న వారిని వదిలేసి, తమ పార్టీ కార్యకర్త పంపన ఆనందరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. తనకే పాపం తెలియదని చెప్పినా పోలీసులు వినకుండా హింసించటంతో ఆనందరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ సర్కార్ మార్కు హత్యాయత్నమేనన్న ఆయన... కార్యకర్త కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మంత్రి గుమ్మనూరు జయరాం బంధువులు పేకాట క్లబ్బులు నడుపుతారని లోకేశ్ పేర్కొన్నారు. పేకాట ద్వారా లక్షల రూపాయలు వస్తున్నాయని చెబుతున్న వైకాపా ఎమ్మెల్యే ఆడియో బయటకు వచ్చినా పోలీసులు వారందిరినీ వదిలేసి కక్షతో తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు.