తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట సమీపంలో నిర్మించిన పునరావాస కాలనీల్లో జనసేన నేత నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పర్యటించారు. ఏనుగుల గూడెం, కచ్చులూరు, కమలం పాలెం, సీతారం పునరావాస కాలనీలు సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. తమకు ప్యాకేజీ చెల్లించకుండానే గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లించిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా గ్రామాల నుంచి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. నిర్వాసితులకు న్యాయం జరగకపోతే జనసేన ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.