రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని.. వాటిని ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటం దారుణమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఈతకోటలో పర్యటించిన ఆయన.. కొత్తపేట నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా, తెదేపా కార్యకర్తలు జనసేనలో చేరారు. వారికి నాదెండ్ల మనోహర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 217 జీవోతో 2500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అవుతాయన్నారు. మత్స్యకారులకు భరోసా బీమా పథకాలు కూడా అందటం లేదని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మత్స్యకార ప్రాంతాలను సందర్శిస్తున్నామని.., సమస్యలపై పవన్‌కు నివేదిక అందిస్తామన్నారు.
ఇసుక మాఫియా భరతం పడతాం..
ఇసుక మాఫియాపై ప్రజల పక్షాన ఉండి జనసేన పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎర్రంశెట్టివారి పాలెం గ్రామాన్ని ఆయన సందర్శించగా.. గ్రామాన్ని ఆనుకుని ఉన్న వంతెనపై నుంచి ఇసుక అక్రమ రవాణా జరగటం వల్ల వంతెన బలహీన పడుతుందని గ్రామస్థులు నాదెండ్ల దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక మాఫియా పనిపట్టేందుకు జనసేన ముందుండి పోరాడుతుందని వారికి భరోసా ఇచ్చారు.