పేదరికం అతని ఆసక్తిని ఆపలేకపోయింది... పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ... పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధిస్తున్నాడు.. ప్రమాదంలో గాయపడినా... పట్టువిడవకుండా సాధన చేశాడు... సంవత్సరంలోనే పుంజుకుని పతకాల పంటపండిస్తున్నాడు. లెక్కకు మించిన పతకాలు సాధించినా... ప్రోత్సాహం మాత్రం శూన్యం.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ కాలనీలో ఉంటున్న బాలకృష్ణకు చిన్నప్పటి నుంచి వ్యాయామంపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లెటట్లు చేసింది. పేద కుటుంబం... దీనికి తోడు చిన్న వయసులోనే పెళ్లి. కుటుంబ బాధ్యత అంతా తనపైనే ఉన్నా... పవర్ లిఫ్టింగ్ సాధన మాత్రం మానేయలేదు..
ఉదయం లేవగానే డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెలకితీసే పనుల్లో నిమగ్నమవుతాడు.. మధ్యాహ్నాం వరకు పారిశుద్ధ్య పనులు చేసిన అనంతరం పవర్ లిఫ్టింగ్ కసరత్తులు మెుదలపెడతాడు.
బాలకృష్ణ 2014 నుంచి ఇప్పటి వరకు 74, 83 కేజీల జూనియర్, సీనియర్ విభాగాల్లో 17 సార్లు పాల్గొని పతకాలు సాధించాడు. 2017లో జగ్గయ్యపేటలో జరిగిన పోటీల్లో రెండు విభాగాల్లోనూ స్ట్రాంగ్ మెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 2020 జనవరిలో హైదరాబాద్ వేదికగా జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో రజిత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.