MP RRR WROTE A LETTER TO THE CENTRAL GOVERNMENT FOR CBN SECURITY: టీడపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ప్రాణహాని తలపెట్టేలా రాష్ట్రంలో అధికార పార్టీ , పోలీసులు వ్యవహరిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఘటనే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి పోలీసులే అడ్డుగా కూర్చోవడంతో పాటు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వాహనాలు అడ్డుపెట్టి అనేక అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కళంకిత, అవినీతి అధికారులతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని స్థాయిల్లోని ప్రతిపక్ష నేతలను, ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అనపర్తి ఘటనలో జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌ని ముందుకు కదలనీయకుండా పోలీసులే అడ్డంగా కూర్చుని నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు.
అరాచక ఘటనలపై కేంద్రం జోక్యం:గత ఏడాది కూడా ఇదే తరహాలో ఆయన ప్రాణానికి హాని తలపెట్టేలా కొన్ని ఘటనలు జరిగాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవాని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఏజన్సీల నుంచి తగిన నివేదికలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు కోరారు. అందుకు అనుగుణంగా వెంటనే ప్రధాని కార్యాలయ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోతుందని రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల తీరుకు ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు.