వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా నేతల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెదేపా హయాంలో వరదలు వచ్చినపుడు రైతులకు ఎలాంటి న్యాయం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
హుద్ హుద్ తుపాను సమయంలో రూ. 2,469 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ నిలిపివేశారని గుర్తు చేశారు. తెదేపా ప్రభుత్వం ఉద్యాన పంటలకు ఎకరానికి కేవలం 10 వేల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తనాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను ఓదార్చాల్సిందిపోయి, చంద్రబాబే ప్రజల నుంచి ఓదార్పు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా నది వరదలను ప్రభుత్వం సృష్టించిన వరదగా చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు.