గోదావరి, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు - ధాన్యం కొనుగోలు రావడం లేదంటూ రైతుల ఆగ్రహం Michaung cyclone caused crop damage in AP:మిగ్‌జాం తుపాను ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఈదురుగాలులతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, టమాట సహా ఇతర పంటలు నేలకొరిగాయి. ఎడతెరపిలేని వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, పొలాలు జలమయమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి పంటను కోసి కల్లాల్లోకి తెచ్చుకున్న రైతులు రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అద్దెకు పట్టాలు తెచ్చి ధాన్యపు రాశులపై కప్పుతున్నారు. వర్షాలు తెరిపివ్వకపోవడంతో తేమశాతం వారిని భయపెడుతోంది. ప్రభుత్వమే స్పందించి ధాన్యం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో: భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగావందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోడ్లపైనా, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిపోయాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో తడిసిన ధాన్యం రాశులను, ముంపుకు గురైన వరి చేలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రైతులతో కలిసి పార చేతబట్టి బాటలు తీసి వర్షపు నీటిని బయటికి తోడారు. ఎడతెరిపిలేని వర్షానికి ఏలూరు, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీరు చేరి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి చిత్తూరులో మిగ్‌జాం ఉధృతి - పొంగుతున్న వాగులు, వంకలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో: తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో వేల ఎకరాల పంట నేలకొరిగింది. ధాన్యం రాశులు, వరి పనలు వర్షానికి తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటను కాపాడుకోలేక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం నుంచి పాపికొండ విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు. కాకినాడ జిల్లాలోని తీరప్రాంతాల్లో కోతకు గురైన గ్రామాలను జిల్లా ఎస్పీ, మాజీ MLA వర్మ పరిశీలించారు.
తుపాను ప్రభావంతో పాపికొండలకు నిలిచిన ప్రయాణం - బోట్ల నిలిపివేత
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో: తుపాను సమాచారంతో చాలామంది రైతులు ముందుగానే ఆదరాబాదరాగా పంటను కోసేశారు. కొందరు రైతులు పంటను కల్లాల్లోకి తరలించగా, కొందరు రహదార్లపైనే కుప్పలుగా పోశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రోజుకు 250 రూపాయలతో అద్దెకు పట్టాలు తెచ్చి పంటను కాపాడుకుంటున్న రైతులు, ఎడతెరిపివ్వని వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆరబెట్టే అవకాశంలేకపోవడం వల్ల ఎక్కువ రోజులు కప్పి ఉంచడం వల్ల ధాన్యంలో తేమశాతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తేమశాతం 17 శాతం దాటితే మద్ధతు ధర దక్కదని భయపడుతున్నారు. ప్రస్తుతం పంటను కోసేందుకు మిషన్ కు అద్దె కింద గంటకు 2800 నుంచి 3వేల రూపాయల వరకు రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన ఎకరాకు 8వేల నుంచి 10వేల రూపాయలవుతోంది. ప్రస్తుతం ధాన్యం తడిసిపోయి, నీటిలో నానిపోయి ఉన్న స్థితిలో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని పర్యటన - రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్