Massive support for Nara Bhuvaneswari తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించిన నేపథ్యంలో... గత కొద్ది రోజులుగా నారా నారా భువనేశ్వరి సైతం రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కలిసి సంఘీభావం తెలిపేందుకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు రాజమండ్రికి తరలివస్తున్నారు. నేడు ఉమ్మడి తూగో జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన నేతలు నారా భువనేశ్వరిని కలిసి పరామర్శించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన శ్రేణులు తెలుగుదేశం కార్యక్రమాలకు ప్రతీ చోట మద్దతు తెలుపుతున్నాయని కందుల దుర్గేష్ తెలిపారు. భువనేశ్వరి ఎంతో ధైర్యంగా ఉన్నారని వెల్లడించారు. వైసీపీకి ప్రజలు ఇచ్చిన అవకాశం అయిపోయినందున ఇక ఇంటికి వెళ్ళటమే మిగిలిందని పేర్కొన్నారు.
రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లను తెలంగాణ రాజకీయ నేతలు పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత అరికెళ్ల నర్సారెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి చంద్రబాబు ని అరెస్టు చేశారని మండవ వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు కేసులో ఏ ఆధారం లేకుండా హైదరాబాద్, దిల్లీలో సీఐడీ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకుని దాచుకునే వాడు దొరలా, పంచి పాలన అందించేవాడు నిందితుడిలా జైల్లో ఉండటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తప్పు చేశారని నమ్మే పరిస్థితిల్లో ఎవ్వరూ లేరన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుని చూస్తే దేశంలో ఉన్న రాజకీయ నేతలంతా జైల్లోనే ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నేత అరికెళ్ల నర్సారెడ్డి అన్నారు. నియంత పోకడలతో చంద్రబాబు ని అరెస్టు చేశారు తప్ప కేసులో ఎలాంటి నిజాయితీ లేదని వెల్లడించారు.