ప్రధాని మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకి పిలుపునివ్వటంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదని సూచించగా... ఇవాళ మార్కెట్లు, రైతుబజార్లు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి. రేపటికి అవసరమయ్యే సరకులను ఈరోజే కొనుగోలు చేశారు.
జన సమూహాల మధ్య తిరగకూడదని అధికారులు చెబుతున్నా చాలామంది లెక్కచేయటం లేదు. కొందరు మాస్కులతో బయటకు వస్తుంటే మరికొందరు సాధారణంగానే రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. జిల్లాలో పలుచోట్ల పాల ప్యాకెట్ల కొరత ఏర్పడింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని విజయవంతం చేస్తామని వ్యాపారులు, ప్రజలు చెబుతున్నారు.