మావోయిస్టు మడకం ఇడుమమ్మ అలియాస్ ఇడిమి అలియాస్ లత తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2016లో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరిన ఇడుమమ్మ.. శబరి ఎల్‌వోఎస్‌లో దళ సభ్యురాలిగా చేరారు. సంవత్సరం తర్వాత చర్ల ఎల్వోఎస్కు బదిలీ అయ్యారు. నాలుగేళ్లు అక్కడ పనిచేసి తిరిగి శబరి ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా ఏడాది పాటు పనిచేశారు. మావోయిస్టు పార్టీ విధానాలు, గుత్తి కోయలపై ఆదివాసీయేతర వివక్ష నచ్చక జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్టు గుత్తికోయ తెగకు చెందిన ఇడుమమ్మ వెల్లడించారు. ఈమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలోని పుంగుట్ట.
పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు - లొంగిపోయిన మహిళా మావోయిస్టు
తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసినట్లు ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తూ.. మావోయిస్టు దళ సభ్యురాలి లొంగుబాటుకు కృషి చేసిన చింతూరు అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్‌ను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు అభినందించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. మావోయిస్టులు లొంగిపోయి ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జన జీవన స్రవంతిలో కలసి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అభివృద్ధి చెందాలన్నారు. లొంగిపోయిన మహిళా దళ సభ్యురాలికి నిత్యావసర సరుకులు అందించిన ఎస్పీ.. ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రాయితీలూ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.