Road Construction Works Not Completed: నాలుగేళ్లపాటు నిరసనలు, ఆందోళనలు.. రాష్ట్రపతి కార్యాలయానికి సైతం ఫిర్యాదుతో ఎట్టకేలకు కొత్త రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంతల రోడ్డు ప్రయాణ బాధలు తప్పుతాయని భావించిన వాహనదారుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఆరు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆరుమాసాలు దాటినా ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మండపేట-ద్వారపూడి రహదారి నిర్మాణ పనుల జాప్యంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ద్వారపూడి- మండపేట రోడ్డు ఒకటి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారి గుంతలుమయంగా మారి వాహన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై మండపేటకు చెందిన మూర్తి అనే వ్యక్తి 2021లో రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేయగా.. 24 గంటల్లో సమస్య పరిష్కరించాలని రాష్ట్రపతి కార్యాలయం అధికారుల్ని ఆదేశించింది.
తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఈ రహదారి మరింత ధ్వంసమవ్వడంతో స్థానికులు పలుమార్లు ఆందోళనకు దిగారు. కొత్త రహదారి నిర్మాణం కోసం పలుమార్లు రోడ్డెక్కారు. ఎట్టకేలకు గతేడాది నవంబర్‌లో 12 కోట్ల అంచనా వ్యయంతో నూతన రోడ్డు పనుల్ని ప్రారంభించినా.. పనులు ముందుకు సాగడం లేదు. గుత్తేదారికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణపనులు సగంలోనే నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.