ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాల్గో పెళ్లికి రిటైర్డ్​ ఉద్యోగి పత్రికా ప్రకటన... పోలీసులను ఆశ్రయించిన మూడో భార్య...

అతనో రిటైర్డ్ ఉద్యోగి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకునేందుకు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అతని మూడో భార్య ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

By

Published : Nov 6, 2020, 5:08 PM IST

Published : Nov 6, 2020, 5:08 PM IST

man Harassing wife
man Harassing wife

బాధితురాలి ఆవేదన

నిత్య పెళ్లికొడుకుపై అతని మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగోసారి వివాహం చేసుకునేందుకు తన భర్త సిద్ధమయ్యాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశాఖ డాక్​యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి వాసంశెట్టి విష్ణుపోతనకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తాళ్లపాలెంకు చెందిన లక్ష్మీసరోజతో 1998లో వివాహమైంది. ఆ సమయంలో 5 లక్షల రూపాయలు కట్నం, లక్ష రూపాయల విలువైన కానుకలు ముట్టజెప్పారు. అప్పటికే ఆయనకు రెండు వివాహాలు జరిగిన విషయాన్ని దాచి మూడోసారి మనువాడాడు. ఈ దంపతులు ఓ మగ బిడ్డను పెంచుకుంటున్నారు.

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పోతన.. మరో పెళ్లికి సిద్ధపడి సరోజను ఇంటి నుంచి గెంటేశాడు. ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. గత నెల 23న అతను తన అత్తగారింటికి వచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలని సరోజను బెదిరించాడు. అందుకు తాను ఒప్పుకోకపోయినప్పటికీ మరో వివాహం చేసుకునేందుకు తాజాగా పత్రికా ప్రకటన ఇచ్చాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. దీనిపై ద్రాక్షారామ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్న విష్ణుపోతనను ద్రాక్షారామం తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details