కరోనా భయం: హాస్పిటల్లో చేర్చుకోలేదు...భార్య కళ్లెదుటే భర్త మృతి
కరోనా భయాలు సామాన్య రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అనారోగ్యంతో హాస్పిటల్స్‌కు వెళితే కరోనా పరీక్షలు చేస్తే కానీ అనుమతించేది లేదని పలు ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెబుతున్నాయి. ఈ లోపు రోగం కాస్త ముదిరి ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అనారోగ్యంతో వెళ్లిన వ్యక్తిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పటంతో... సరైన సమయానికి వైద్యం అందక ఆసుపత్రి ఎదుటే మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది.
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సరైన సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి చెందాడు. గొల్లప్రోలు గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణ రెండు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతని భార్య... శ్రీమన్నారాయణను పిఠాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. కరోనా పరీక్ష చేయనిదే హాస్పిటల్లో చేర్చుకోమని సిబ్బంది నిరాకరించిన కారణంగా ఆసుపత్రి ముందే ప్రాణాలు వదిలినట్లు భార్య ఆరోపించింది. మృతుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కొవిడ్ నిర్థారణ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. భర్త కళ్ల ముందే చనిపోవటంతో... రోడ్డుపై మృతుని భార్య విలపించిన తీరు అందరినీ కలచివేసింది.