ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్రమణలపర్వం : రూపు కోల్పోతున్న ప్రధాన పంట కాలువలు - land grabbing in godavari districts

ఉభయగోదావరి జిల్లాలకు ఆయువుపట్టు.. ప్రధాన పంట కాలువలే. వీటిని అపురూపంగా చూసుకోవాల్సిన వేళ.. అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. ఆక్రమణల పర్వం ఇంతింతై అనేలా జోరు మీదుంది. కాసింత జాగా కన్పిస్తే చాలు.. వేసెయ్‌ పాగా అన్నట్లు అక్రమార్కులు ఆక్రమణలతో కదం తొక్కుతున్నా.. కొరడా ఝళిపించాల్సిన వారు దాటవేత ధోరణిలో ఉన్నారు. అధికారులు కొంత వరకూ ఆక్రమణలను గుర్తించినా తొలగింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో అడుగు ముందుకు వేయలేని దయనీయం. జిల్లాలో ప్రధాన పంటకాలువలపై ఉన్న ఆక్రమణలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం

Major crop canals emerging
Major crop canals emerging

By

Published : Aug 8, 2020, 8:11 PM IST

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు పంట కాల్వలే ప్రధాన ఆయువు పట్టు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి ఈ కాల్వల ద్వారా సాగు, తాగునీటిని విడుదల చేస్తారు. కాల్వగట్లు ఆక్రమణలకు గురవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధాన, పిల్ల కాల్వలు కూడా ఆక్రమణల బారిన పడటంతో కాల్వలు కుచించుకుపోయి నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. దీంతో పాటు శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది.

ఆక్రమణల వివరాలు

సుమారు 50వేల ఎకరాల శివారు ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో నీరు వేగంగా వెళ్లక ముంపునకు గురై ప్రాణ, పంట, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కాల్వల్లో చెత్త చెదారం వేస్తుండటంతో నీరు కాలుష్యం బారిన పడుతోంది. కేవలం సాగు నీటికే కాకుండా ఈ కాల్వల్లో నీటిని శుద్ధి చేసి తాగునీటికి కూడా ఉపయోగిస్తారు. అయినా నీరు కలుషితం కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది? ...

నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదికి మధ్యలో, పంట కాలువలు, ఏటిగట్లపై ఎటువంటి కట్టడాలు నిర్మించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాణాలు చేయాల్సి వస్తే కచ్చితంగా జలవనరులశాఖ, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, నిబంధనలు పాటించాలి. అయితే జిల్లాలో అవి ఎక్కడా కనిపించని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ శాశ్వత కట్టడాలు నిర్మించేస్తున్నారు.

నీరు అందక ఇబ్బందులు..

ప్రధాన పంట కాలువలు మొదలు పిల్ల కాలువల వరకు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. దీంతో రబీ సమయంలో శివారు ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల కిందట కాలువలు కనుచూపు మేరలో చక్కగా కనిపించేవి. ఆక్రమణల బారిన పడటంతో ఇప్పుడా పరిస్థితి లేదు. - మంతెన రమేష్‌రాజు, రైతు, పి.గన్నవరం మండలం

అనుమతులు రాగానే తొలగిస్తాం..

ప్రధాన పంట కాలువలపై ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించాం. ఏ నిర్మాణానికీ మేం అనుమతి ఇవ్వలేదు. మా శాఖ స్థలాల్లో పాగా వేసిన వారికి ఇప్పటికే తాఖీదులు జారీ చేశాం. వీటి తొలగింపునకు రెవెన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ సహకారం కావాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అనుమతులు రాగానే ఆక్రమణలు తొలగిస్తాం - మోహనరావు, ఈఈ, ధవళేశ్వరం సర్కిల్‌

ఇదీ చదవండి

సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details