ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HEROIN CASE: నా కుమారుడు ఎలాంటి తప్పులు చేసేవాడు కాదు: సుధాకర్ తల్లి - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు

గుజరాత్​లో రూ. 9 కోట్ల హెరాయిన్​తో పట్టుబడ్డ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాచవరం సుధాకర్ అరెస్టుపై.. ఆయన తల్లి వెంకటేశ్వరీ స్పందించారు. తన కుమారుడు ఎటువంటి తప్పులు చేసేవాడు కాదని తెలిపింది.

రూ.9 కోట్ల హెరాయిన్​తో పట్టుబడ్డ మాచవరం సుధాకర్
రూ.9 కోట్ల హెరాయిన్​తో పట్టుబడ్డ మాచవరం సుధాకర్

By

Published : Sep 22, 2021, 7:48 PM IST

మాట్లాడుతున్న సుధాకర్ తల్లి

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ గుజరాత్​లో రూ.9 కోట్ల హెరాయిన్​తో పట్టుబడ్డ విషయం విధితమే..అయితే సుధాకర్ అరెస్ట్​పై ఆయన తల్లి, సోదరుడు స్పందించారు. తల్లి వెంకటేశ్వరీ మాట్లాడుతూ... తన కుమారుడు కొన్నాళ్లు విశాఖలో ఉద్యోగం చేసేవాడని..ఆ తర్వాత చెన్నైలో స్థిరపడినట్లు వెల్లడించిన ఆమె...తన కుమారుడు ఎటువంటి తప్పులు చేసేవాడు కాదని పేర్కొంది. కరోనా మెుదటి వేవ్ వచ్చిన తర్వాత ఉద్యోగం మానేశాడని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది..

తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ను పావుగా వినియోగించుకుని అతని భార్య పేరుతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ సంస్థ పేరుతో జూన్‌లో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతైనట్లు గుర్తించారు. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకూ తరలించినట్లు తేల్చారు. ఐదు రోజుల కిందట సుధాకర్, అతని భార్య గోవిందరాజుల వైశాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మదాబాద్, దిల్లీ సహా చెన్నైలో సోదాలు నిర్వహించారు. భార్యభర్తలిద్దరితో పాటు సోమవారం మరికొందర్ని అరెస్టు చేశారు.

గతంలో విశాఖలో ఉద్యోగం చేసిన సుధాకర్ ఎనిమిదేళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. ఓ పేరొందిన సిమెంట్‌ కంపెనీలో లాజిస్టిక్‌ మేనేజర్‌గా పనిచేశాడు. పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల వ్యవహారం, కస్టమ్స్‌ అనుమతులు సహా ఇతర అక్రమ వ్యవహారాలపై పట్టుసాధించాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ముఠాల్లో కొందరితో పరిచయమేర్పడినట్లు కేంద్ర సంస్థలు గుర్తించాయి. వారి సూచనతోనే విజయవాడలో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రారంభించాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నాయి.

సుధాకర్ అత్తింటినే అద్దెకు తీసుకుంటున్నట్లు చూపి ఆషీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడు. బియ్యం, పండ్లు హోల్‌సేల్‌ వ్యాపారం చేసేందుకు కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు లైసెన్స్ పొందాడు. విజయవాడ చిరునామాతో కంపెనీ ఉన్నప్పటికీ సుధాకర్‌ కార్యకలాపాలేవీ ఇక్కడ ఉండేవి కాదని నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. చెన్నై కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించేవాడని తెలుస్తోంది. దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది మత్తు ముఠాల సభ్యులకు సుధాకర్ పావుగా మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన ఎగుమతి-దిగుమతి కోడ్ తమకు ఇస్తే భారీ మొత్తంలో కమీషన్‌ చెల్లిస్తామంటూ ఉచ్చులోకి లాగినట్లు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి ఎగుమతి- దిగుమతి కోడ్‌ పొంది మత్తు ముఠాల సభ్యులకు అందజేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో టెర్రర్‌ ఫండింగ్‌ ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధమూ లేదని విజయవాడ సీపి బి. శ్రీనివాసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త

ABOUT THE AUTHOR

...view details