తెలంగాణ కాంగ్రెస్‌లో చల్లారిన విభేదాలు..చేతులు కలిపిన సీనియర్ నేతలు Leaders participating in the Activities of Congress Party: రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలకు తాత్కాలికంగా కళ్లెం పడింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నాయకులు కలిసి వస్తున్నారు. పీసీసీ కమిటీలను వ్యతిరేకిస్తూ, తిరుగుబావుటా ఎగురవేసిన సీనియర్లు సైతం ప్రస్తుతానికి చల్లబడ్డారు. సంక్షోభం దిశగా వెళ్లి పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న తరుణంలో అధిష్ఠానం జోక్యం చేసుకుని వేడిని చల్లార్చే పని చేపట్టింది.
నూతనంగా వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే సమస్యల పరిస్కారం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా నాయకులకు కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారు చెప్పే విషయాలను సావధానంగా వింటూ నోట్ చేసుకుంటున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ వచ్చిన మాణిక్‌రావు ఠాక్రే మూడు రోజులు మకాం వేసి సమావేశాలు నిర్వహించారు.
'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' సన్నాహాక భేటీతో పాటు.. నాయకులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్‌లతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో గాంధీభవన్‌కు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌తో మాట్లాడటం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, మహేశ్వర్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోదండ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సానుకూలమైన సంకేతాలు పంపినట్లైంది.
నాగర్ కర్నూల్‌లో జరిగిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలోనూ నేతలందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ సర్కార్ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఈ సభలోనే మాట్లాడిన రేవంత్ రెడ్డి నేతల మధ్య విభేదాలు తొలగిపోయాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు రెండు నెలల పాటు పాదయాత్ర నిర్వహించాల్సి రావడంతో, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డిలతోపాటు ఇతర సీనియర్ నాయకులతో కలిసి చర్చించిన తర్వాత 12 మంది సభ్యులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి: