ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేట కెనరా బ్యాంకు దొంగను పట్టుకున్న పోలీసులు - కొత్తపేట కెనరా బ్యాంకు తాజా వార్తలు

రోజువారీ వేతనంతో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వ్యక్తే బ్యాంకుకు కన్నమేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో దొంగతనానికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 7వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అతడి నుంచి రూ.16,19,300 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Kottapeta Canara Bank robber caught by police
కొత్తపేట కెనరా బ్యాంకు దొంగను పట్టుకున్న పోలీసులు

By

Published : Dec 13, 2020, 9:29 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో దొంగతనం చేసి పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అదే బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగి.. అమలాపురం మండలం, జనిపల్లికి చెందిన బండారు తులసి సురేష్ ‌(21)ను శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16,19,300 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ వెల్లడించారు. కొత్తపేట కెనరా బ్యాంకులో తులసి సురేష్‌ 2018 జూన్‌ నుంచి పని చేస్తున్నాడు.

ముందుగానే రచించిన ప్రణాళిక ప్రకారం.. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బ్యాంకు ఉద్యోగులు భోజనానికి వెళ్లిన సమయంలో మారు తాళాలతో రూ.9,23,000 నగదు, 322 గ్రాముల బంగారు వస్తువులను అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కాకుండా యూపీఎస్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశాడు. చోరీ సొమ్ముతో ఒక బైకు, సెల్‌ఫోను, బంగారు ఉంగరం కొన్నాడు.

ఎవరూ గుర్తుపట్టకుండా గుండు చేయించుకుని, జిల్లాతో పాటు విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మకాం వేసి, తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని పట్టుకోడానికి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అమలాపురంలో అతడిని అరెస్టు చేసి, చోరీ చేసిన సొమ్ములో రూ.7,90,000 నగదు, 322 గ్రాముల బంగారు వస్తువులు, 8 గ్రాముల ఉంగరం, మోటారు సైకిల్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ఛేదించిన అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, రావులపాలెం సీఐ కృష్ణ, కొత్తపేట ఎస్‌ఐ రమేశ్‌, అదనపు ఎస్‌ఐ కేవీఎస్‌ సత్యనారాయణ, ఏఎస్‌ఐ బాలకృష్ణ, ఇతర సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏఎస్పీ(సెబ్‌) గరుడ్‌ సుమిత్‌, ఏఎస్పీ (పరిపాలన) కరణం కుమార్‌, డీఎస్పీ అంబికాప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

నెల్లూరులో ఏలూరు తరహా ఘటన... అస్వస్థతతో వలస కూలీ మృతి

ABOUT THE AUTHOR

...view details