తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కార్తిక మాసం తొలి సోమవారం... భక్తులు గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. శివం బాత్ వద్ద జల్లు స్నానాలు చేసి సమీప ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పరిమిత సంఖ్యలోనే గోదావరి తీరానికి అనుమతించారు. తెల్లవారిజామున 3 గంటల నుంచే భక్తులు రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు.
కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని.. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని పలు శివాలయాలు వేకువజాము నుంచే భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని భక్తిశ్రద్ధలతో పూజించారు. భక్తజనంతో శివాలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమలాపురం, అయినవిల్లి, పి.గన్నవరం, కొత్తపేట, ఐ. పోలవరం, రాజోలు తదితర మండలాల్లో గల శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు పరమశివుడికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. కొవిడ్ కారణంగా..భక్తులకు ధర్మల్ స్క్రీనింగ్ చేసి ఆలయాల్లోకి అనుమతించారు.