తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుంచి సామర్లకోటకు వెళ్లే రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సామర్లకోట లాకుల నుంచి కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్ వరకూ కేవల 15 కి.మీల దూరం ప్రయాణం వాహనదారుల సహనానికి తీవ్ర పరీక్ష పెడుతోంది. జిల్లా కేంద్రం కాకినాడకు 10 నియోజకవర్గాల ప్రజలు ఈ దారిపైనే ప్రయాణించాలి. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, రంపచోడవరంతో పాటు కాకినాడ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ దారిలోనే జిల్లా కేంద్రానికి వస్తుంటారు. సామాన్య ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారిపై ప్రయాణం మాత్రం నరకంగా మారింది. ఏళ్ల తరబడి విస్తరణ, అభివృద్ధి జరగకపోవడంతో ఈ దారి గుంతలమయంగా మారింది. ఉన్న కొద్దిపాటి రోడ్డుపై వేలాది వాహనాలు అత్యధిక రద్దీతో ప్రయాణం సాగిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతలమయంగా రహదారి..పట్టించుకోని అధికారులు
అది అత్యధిక జనాభా కలిగిన జిల్లా కేంద్రాన్ని కలిపే ప్రధాన రహదారి. పది నియోజకవర్గాలకు పైగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం జిల్లా కేంద్రానికి ఆ దారిలోనే ప్రయాణం చేస్తుంటారు. వేలాది వాహనాలు, అత్యధిక రద్దీతో ఈ రహదారిపై సాగిపోతుంటాయి. ఇలాంటి రోడ్డు పూర్తిగా ధ్వంసమై అధ్వాన్నంగా మారింది. ఆ దారిలో వాహనదారులు మాత్రం నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.
అధ్వాన్నంగా మారిన రహదారి
సామర్లకోట-కాకినాడ రహదారి విస్తరణకు రెండేళ్ల క్రితమే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. రహదారి వెంబడి ఉన్న ఇళ్లనన్నంటినీ తొలగించారు. అయినా పనులు మాత్రం ప్రారంభించలేదు. పూర్తిగా ధ్వంసమైన ఈ రహదారిపై వాహనదారులు రాకపోకలు సాగించేందుకు నరకం చూస్తున్నారు. కేవలం 15 కి.మీల దారిని ఏళ్ల తరబడి విస్తరించకపోవటంతో వాహనదారలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.