తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. ఈ నెల 12 నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
ఈ నియమావళిని అతిక్రమిస్తూ.. ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన.. భవన నిర్మాణ కార్మికుల భవనం, వ్యాయామశాలను 44వ డివిజన్లో ప్రారంభించారు. మేయర్ సుంకర పావని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీటిని ఆరంభించారు. నగరపాలక సంస్థ ఈఈ సత్యకుమారి, డీఈ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరతామని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీఆర్వో సత్తిబాబు చెప్పారు.