ఈ నెల 7న కాకినాడ వద్ద సముద్రం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభించింది. మచిలీపట్నం తీరంలో ఏడుగురూ క్షేమంగా ఉన్నట్లు ఈరోజు 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు వారు సమాచారం అందించారు. ఇంజన్ ఆగిపోవడంతో వాయుగుండంలో చిక్కుకుని దారితప్పామని తెలిపారు. తమ వద్దనున్న కొద్దిపాటి ఆహారంతో రెండు రోజులకు ఒకసారి తింటున్నామని వీడియో సందేశం పంపారు. తమను త్వరగా ఒడ్డుకు చేర్చాలని వేడుకుంటున్నారు.
మచిలీపట్నం తీరంలో కాకినాడ మత్స్యకారులు క్షేమం
మత్స్యకారులకు సముద్రమే జీవనోపాధి. వారి పొట్ట నిండాలంటే వేటకెళ్లాల్సిందే. అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలవాల్సిందే. ఈనెల 7న కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల జాడ తెలియక ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు మచిలీపట్నం తీరంలో ఉన్నామని వారు సమాచారం ఇవ్వగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారిని ఒడ్డుకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బోటు ఆచూకీ లభ్యం
మత్స్యకారుల్ని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ బోటు సరిగ్గా ఏ ప్రాంతంలో ఉందో ఇప్పటికీ గుర్తించలేదు. కుటుంబ సభ్యులు, మత్స్యకార సంఘాలు సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి:కోనసీమలో నీట మునిగిన పొలాలు-నష్టాన్ని అంచనా వేసిన అధికారులు
Last Updated : Oct 15, 2020, 7:58 PM IST