Kadiyam Police Harrased Dalith Young man In East Godavari District: తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీసులు ఓ కేసు విచారణ పేరిట స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ వాపోయారు. స్టేషన్ ఎస్సై తీవ్రంగా కొట్టడంతో పాటు.. దాహం వేస్తోంది నీరు కావాలని అడిగితే మూత్రం తాగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళ అదృశ్యం కేసులో ఈ నెల 17న స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్సై తీవ్రంగా కొట్టారని చాగల్లు మండలం కుంకుడుపల్లికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ వాపోయారు. సృహతప్పిన తనకు పైకి లేపి మరీ కొట్టి సంతకం చేయించుకున్నారని... ఆపై ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి బాధితుడిని డిశ్చార్జ్ చేశారు.
"నేను నా మిత్రునికి బైక్ ఇచ్చాను. అతను బండి తీసుకెళ్లి మిస్యూజ్ చేశాడు. నాకు ఫోన్ చేసి ఓనిగట్ల రమ్మని చెప్పారు. నా దగ్గర రావటానికి ఎలాంటి వాహనం అందుబాటులో లేదని చెప్పాను. బండి పంపిస్తామని చెప్పి పంపించారు. దానిపై అక్కడకు చేరుకున్నాను. అక్కడి నుంచి కడియం తీసుకువచ్చారు. అక్కడ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులపై, చాతిపై, మొహంపై కొట్టారు. దాహం వేస్తోందని నీళ్లు అడిగితే.. నీళ్లు కాదురా నా మూత్రం తాగు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు." -వెంకటప్రసాద్, బాధితుడు
Allegations On Police: విచారణ పేరుతో పిలిచి చితకబాదారు.. ఓ బాధితుడి ఆవేదన
తన భర్తను పోలీసులు తీసుకెళ్లిన విషయం అర్ధరాత్రి చెప్పారని.. ఆస్పత్రి వద్దకు వస్తే పోలీసులు లోపలికి అనుమతించలేదని బాధితుడి భార్య శిరీష చెప్పారు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని.. ఎంత డబ్బులైనా ఇస్తామని చెప్పారన్నారు. తన భర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు.