Flower Plants in kadiyam Nursery: వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలకు ప్రఖ్యాతిగాంచిన కడియం నర్సరీల్లో ఇప్పుడు సీజనల్ పూల మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. వివిధ వర్ణాల్లో అనేక రకాల వింజామరులు మనసును ఇట్టే దోచేస్తున్నాయి. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీజనల్ పూల మొక్కలు చూపరుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఏటా నవంబర్ నుంచి ఈ సీజనల్ పూల మొక్కలు అందుబాటులోకి వస్తాయి. ఈసారి భారీ వర్షాలు కురవడంతో ఈ సీజనల్ మొక్కలు కడియం నర్సరీలకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. కొందరు రైతులు స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. మొక్కలు ప్రాణం పోసుకొని అందాలు ఆరబోయడానికి ముస్తాబవుతున్న సమయంలో మాండౌస్ తుపాను విరుచుకుపడటంతో దెబ్బతిన్నాయి. కాస్త ఆలస్యమైనా తాజాగా రకరకాల సీజనల్ పూల మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ రకాలైన బంతులు, చేమంతులతోపాటు వివిధ దేశాలకు చెందిన డాలియా, సాల్వియా, పిటోనియా, డామాంతస్, వర్సీనా, గజేనియా, ప్లాక్స్, ఆస్ట్రో, పెంటాస్, జినియా వంటి వివిధ రకాల మొక్కలు కడియం నర్సరీల్లో దర్శనమిస్తున్నాయి.
ప్రకృతి ప్రతికూలతల మధ్య అతికష్టం మీద గత నెల నుంచి సీజనల్ పూల మొక్కల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు నర్సరీ నిర్వాహకులు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు మొక్కల్ని చూసి మైమరచిపోతున్నారు. మనసు దోచిన మొక్కల్ని కొనుగోలు చేస్తున్నారు.