తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో మత్స్యకారుల అభ్యున్నతి యాత్ర మొదలైంది. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మత్స్యకారుల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయమన్నారు. పవన్ కల్యాణ్ సీఎం అయితే మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అభివృద్ధి పేరుతో మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
"వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన 217 జీవోను వెనక్కి తీసుకోవాలి. దీని వల్ల 4.5 లక్షల మంది మత్స్యకారుల ఉనికి, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. చెరువులను ఆన్లైన్లో వేలం నిర్వహిస్తే.. దాదాపు 2,500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ఈనెల 20వ తేదీన నరసాపురంలో జరగబోయే సభలో పవన్ కల్యాణ్.. ఈ అంశాలను ప్రస్తావిస్తారు. మత్స్యకారుల భవిష్యత్ కోసం జనసేన చేపట్టబోయే కార్యాచరణను ప్రకటిస్తారు" - నాదెండ్ల మనోహార్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్