తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డ్వాక్రా సంఘాలు, జిల్లా వ్యవసాయ సహకార మార్కెటింగ్ కమిటీ, రైతు మిత్ర గ్రూపుల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏటా నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించినందుకు ప్రతి సీజన్‌లో రూ.కోట్లలో కమీషన్ చెల్లిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు మరిన్ని సేవలను క్షేత్రస్థాయిలో అందించాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టాలని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సొసైటీలకు ఇచ్చే కమీషన్‌ను రైతు భరోసా కేంద్రాలకు మళ్లించడం ద్వారా వీటిని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాలతో ధాన్యం సేకరణ చేస్తే కమీషన్ ఇచ్చే అవకాశం ఉండదు. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏదో ఒక ఏజెన్సీని మనుగడలోకి తెచ్చి, దాన్ని రైతు భరోసా కేంద్రానికి అనుసంధానం చేయడం ద్వారా వీటికి ప్రయోజనం చేకూర్చాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఒకేచోట నుంచి కార్యకలాపాలు
జిల్లాలో ప్రస్తుతం రెండుచోట్ల నుంచి ధాన్యం సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వివిధ సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతు భరోసా కేంద్రాలను అనుసంధానం చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి, 885 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించారు. దీంతో రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ధాన్యం నమూనాల తేమ శాతాన్ని పరీక్షించుకుని, తరువాత కొనుగోలు కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇక వచ్చే సీజన్ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని ప్రక్రియలు రైతు భరోసా కేంద్రాల ద్వారానే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం క్వింటా ధాన్యం సేకరణకు రూ.31.25 చొప్పున కొనుగోలు కేంద్రాలకు కమీషన్ ఇస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సరాసరి 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నారు. తద్వారా ఈ కేంద్రాలకు రూ.కోట్లలో కమీషన్ వస్తోంది. ఇక వీటిని రద్దు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని సేకరించనున్నారు.