తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి పరివాహక ప్రాంతాల్లో 3వేల ఎకరాలకు పెద్దగడ్డ కాలువ సాగు నీరందిస్తుంది. కొండకోనల్లోంచి వచ్చే సహజ జలాలతోపాటు...నారాయణదొర చెరువు, సుబ్బారెడ్డి సాగర్ నుంచి వచ్చే లీకేజీ నీరూ ఈ కాలువ ద్వారా ప్రవహిస్తుంది. చివరకు ధర్మవరంలోని పేర్రాజు, వీరభద్రరావు చెరువులకు చేరుతుంది. ఇక్కడి 3వేల ఎకరాలకు ఈ పెద్దగడ్డ కాలువే దిక్కు.
పంట కాలువ ఆక్రమణ... ఆందోళనలో రైతులు - ఆందోళనలో రైతులు
మెట్ట ప్రాంతంలో సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు, ఐదారు గ్రామాలకు తాగునీరు అందించే పెద్దగడ్డ కాలువ నేడు కబ్జాకోరల్లో చిక్కుకుంది. కాలువ భూమిపై కన్నేసిన ఓ అక్రమార్కుడు ఏకంగా కాలువ పూడ్చి దారి మళ్లించడం ఆయకట్టు రైతుల్లో ఆందోళన రేపుతోంది. కిలోమీటరు మేర పూడ్చివేసినా నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
25 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ కాల్వను ఉత్తరకంచి రైతు... తన పొలం వద్ద కిలోమీటరు మేర పూడ్చేశాడు. కాలువ దిశ మార్చి ఒమ్మంగి గ్రామం వైపు కొత్తగా తవ్వాడు. కాలువ పూడ్చిన స్థలాన్ని ఆక్రమించాడు. దీనిపై సదరు రైతును ఆయకట్టు రైతులు నిలదీశారు. అయినా పట్టించుకోకుండా తన పని కానిచ్చాడు. వందల ఏళ్లుగా పెద్దగడ్డ కాలువ కింద సాగవుతున్న భూమి... ఈ చర్యతో బీడుగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాలువ పూడ్చివేతతో దారి కోల్పోవడమే కాకుండా... ఒమ్మంగి పొలాలు ముంపు బారిన పడతాయని రైతులు భయపడుతున్నారు. కాలువ అడ్డగోలుగా ఆక్రమించుకున్నా... పట్టించుకోని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాలువను పునరుద్ధరించాలని ప్రత్తిపాడు మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.