యానాంలో మల్లాడికి ఎదురుదెబ్బ.. యువ కెరటం విజయ బావుటా! పుదుచ్చేరి శాసనసభ పరిధిలోని యానాం నియోజకవర్గ స్థానానికి జరిగిన ఎన్నికల్లో.. స్థానిక యువకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై 655 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లపాటు ఓట్ల లెక్కింపు ఉత్కంఠ కొనసాగింది. చివరకు అశోక్‌ను విజయం వరించింది.
యానం నుంచి మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు వరుసగా 5 దఫాలు గెలిచారు. పాతికేళ్లపాటు అప్రతిహతంగా తన విజయపరంపర కొనసాగించి యానాంలో ఒకే ఒక్కడుగా పేరుగాంచారు. అలాటింది ఈసారి పోటీ చేయబోనని ముందే ప్రకటించారు. తన తరఫున మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామిని బరిలో నిలిపారు. రంగస్వామి గెలుపు కోసం అన్నీ తానై నడిపించారు. ఆయన విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. మరోవైపు... బలమైన సామాజిక వర్గానికి చెందిన అశోక్ తండ్రి గంగాధర ప్రతాప్ గతంలో మల్లాడిపై పోటీచేసి ఓడిపోయారు.
తండ్రి ఆశయంతో గత జనవరిలో 'నమస్తే యానాం' అంటూ అశోక్ రాజకీయ అరంగేట్రం చేశారు. పాతికేళ్లుగా ఒకే వ్యక్తి ప్రాతినిధ్యం వహించడంతో యానాం ప్రజలకు స్వేచ్ఛ కావాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే స్థానికేతర అభ్యర్థి గెలిస్తే అందుబాటులో ఉండరని.. ముమ్మర ప్రచారం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు, ప్రముఖులు అశోక్ గెలుపు కోసం పూర్తి సహకారం అందించారు. ఇవన్నీ కలిసి మల్లాడి కంచుకోటను బద్దలు కొట్టాయి.
పాతికేళ్లుగా పని చేసిన మల్లాడిపై అసంతృప్తి, తమిళ వ్యక్తిని పోటీలోకి నిలపడం, ఐదేళ్లుగా యానాంలో అభివృద్ధి కుంటుపడటం, నిలిచిన సంక్షేమ పథకాలు, నిరుద్యోగం తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఇది ప్రజా విజయమని ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని గొల్లపల్లి అశోక్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఓటమి