కాకినాడలో 73వ స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన సంబరాల్లో జిల్లా ఇంఛార్జి మంత్రి ఆళ్ల నాని జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆళ్ల నాని జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రముఖులను కీర్తించారు. వైకాపా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని చాటుతూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మతసామరస్యం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలకు చెందిన ప్రదర్శనలు అదరహో అనిపించాయి. ప్రభుత్వ పథకాలను గురించి అవగాహన కల్పిస్తూ నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.