ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టని పునరావాసం..తప్పని వనవాసం ! - గిరిజనులకు అందని పరిహారం

పోలవరం ప్రాజెక్టుపై తర్జనభర్జన ఉత్కంఠ రేపుతోంది. గిరిజన కుటుంబాల పునరావాసం, అందాల్సిన పరిహారంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలో పునరావాస ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆగస్టులో రెండుసార్లు వరదలకు గిరిజనులు చిగురుటాకుల్లా వణికారు. మళ్లీ వరదొస్తే ఎలాగని కలవరపడుతున్నారు. 2006 నుంచి నిర్వాసితులను ఖాళీ చేయిస్తున్నా.. అందని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పూర్తికాని ఇళ్లు శాపంగా మారాయి. కరోనా వేళ ఉపాధి కోల్పోయి మైదాన ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో యాతన పడుతుంటే.. మరికొందరు ఊళ్లు వదలలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Incomplete R&R colonies at eastgodavari district
పట్టని పునరావాసం..తప్పని వనవాసం !

By

Published : Oct 30, 2020, 7:39 PM IST

పోలవరం ప్రాజెక్టుపై తర్జనభర్జన ఉత్కంఠ రేపుతోంది. గిరిజన కుటుంబాల పునరావాసం, అందాల్సిన పరిహారంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలో పునరావాస ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆగస్టులో రెండుసార్లు వరదలకు గిరిజనులు చిగురుటాకుల్లా వణికారు. మళ్లీ వరదొస్తే ఎలాగని కలవరపడుతున్నారు. 2006 నుంచి నిర్వాసితులను ఖాళీ చేయిస్తున్నా.. అందని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పూర్తికాని ఇళ్లు శాపంగా మారాయి. కరోనా వేళ ఉపాధి కోల్పోయి మైదాన ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో యాతన పడుతుంటే.. మరికొందరు ఊళ్లు వదలలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

దేవీపట్నం మండలంలో 44 ముంపు గ్రామాలున్నాయి. 18 గ్రామాల గిరిజనేతరులకు కృష్ణునిపాలెం వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక పనులు నెమ్మదించాయి. 2019 జనవరి 18న రూ.113 కోట్ల అంచనాతో చేపట్టిన పనులు ఈ ఏడాది జనవరికే అవ్వాల్సి ఉన్నా కాలేదు. కాలనీలో 1,067 ఇళ్లకుగాను 650 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.

పి.గొందూరు గిరిజనులకు నేలకోట సమీపంలో పునరావాస కాలనీ నిర్మించారు. 123 ఇళ్ల నిర్మాణం పూర్తవగా.. 2011లో గృహ ప్రవేశాలు జరిగినా.. నేటికీ గిరిజనులు వెళ్లలేదు. 14 మంది రైతులకు 76 ఎకరాల కొండపోడు భూములకు పరిహారం చెల్లించలేదు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు 96 మందికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు, ఇళ్ల నిర్మాణం పూర్తిచేయలేదు. గతంలో ప్రకటించిన రూ.2 లక్షల అదనపు సాయం 22 మందికి అందలేదు. ఊరు ఖాళీ చేసి కాలనీకి వెళ్తే పరిహారం అందదని వాపోతున్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.7.36 లక్షలు, గిరిజనేతర కుటుంబానికి రూ.6.36 లక్షలు, ముంపు నిర్వాసితులకు ఎకరానికి రూ.7.5 లక్షలు ఇవ్వాలి. వీరిలో ఒక్కరికీ చెల్లించలేదు. భూసేకరణకు రూ.860 కోట్లకు గాను.. రూ.316 కోట్లను వెచ్చించారు. దేవీపట్నం పరిధిలో 15,653 ఎకరాలు ముంపు అని గుర్తించగా ప్యాకేజీకి రూ.491 కోట్లు రావాలి. మొత్తంగా పునరావాసానికి రూ.6,371 కోట్లు వెచ్చించగా ఇంకా రూ.26,796 కోట్లు అవసరమని అంచనా.

వీడని సమస్యలు

గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం, గంగవరం మండలాల్లో 1,685 ఇళ్లు, గిరిజనేతర నిర్వాసితులకు కృష్ణునిపాలెంలో 1,067 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఎటపాక, కూనవరం మండలాల్లోని పునరావాస కాలనీల్లో 1,162 ఇళ్లలో ఆరు మాత్రమే పూర్తయ్యాయి. వరదలకు ముందే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి కాలనీ నిర్మాణాలు పూర్తిచేసి తరలిస్తామని ప్రజాప్రతినిధులు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కొన్నిచోట్ల నిర్మాణాలైనా పరిహారం అందక లబ్ధిదారులు వెళ్లడంలేదు.

పరిహారం ఎన్నడో?

నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు, భూనష్ట పరిహారం అందలేదు. పి.గొందూరు గిరిజన గ్రామానికి పునరావాస కాలనీ నిర్మించి పదేళ్లు దాటినా పరిహారం అందక పాత గ్రామాల్లోనే ఉంటున్నారు. వీరి కోసం నిర్మించిన కాలనీల్లో తుప్పలు మొలిచాయి. పోతవరం వద్ద పెనికలపాడు పునరావాస కాలనీ కూడా ఇలాగే ఉంది. దేవీపట్నం మండలంలో భూమికి భూమి ఇవ్వడానికి 1,405 ఎకరాలు కావాలి. ఇంతవరకు 1,117 ఎకరాలే ఇచ్చారు.

ప్యాకేజీ ఇప్పించండి

మా ఊరికి దగ్గర్లో గోదావరి మధ్యలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఉంది. భద్రాచలంలో గోదావరికి కాస్త వరద పెరిగినా ఎగువ కాఫర్‌ డ్యామ్‌తో నీరు పోటెత్తి ముందుగా మునిగేది మా ఊరే. నిరుడు వచ్చిన గోదావరి వరదలకు ఇళ్లు కూలిపోతే ఈసారి వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. ప్యాకేజీతోపాటు కాలనీలు అందిస్తే అక్కడికి వెళ్లిపోతాం. - వెంకటేశ్వరరావు, పోశమ్మగండి, నిర్వాసితుడు

వరదొస్తే కొండ మీదకే...

గోదావరికి వరద పెరిగితే మా ఊరు పూర్తిగా నీటిలో మునుగుతుంది. ఈ ఏడాది వరదలకు ఇళ్లలో సామగ్రి కొట్టుకుపోయి.. ఇళ్లన్నీ పడిపోయాయి. చీకటిలో కొండపైనే తలదాచుకున్నాం. పోతవరం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలు పునాది స్థాయిలో ఉన్నాయి. కాలనీలు పూర్తిచేసి మాకు రావాల్సిన ప్యాకేజీలు ఇవ్వాలి. - రామాయమ్మ, గానుగులగొందు, నిర్వాసితురాలు

వచ్చే సీజన్‌లోగా తరలిస్తాం

నిర్వాసిత కుటుంబాలను ఈసారి వరదలకు ముందే తరలించాల్సి ఉంది. కొవిడ్‌, కొన్ని కారణాలతో సాధ్యపడలేదు. కొందరు కాలనీలకు వెళ్లినా.. మరికొందరు రావాల్సి ఉంది. వచ్చే వరదల సమయానికి ముందే నూరు శాతం తరలిస్తాం. కొన్ని కాలనీలు పూర్తయితే.. మరికొన్నింటిలో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కొత్త కాలనీల నిర్మాణానికి కొంత సమయం పడుతుంది. పూర్తయిన కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. పరిహారం విషయమై ప్రభుత్వానికి నివేదిస్తాం. - డి.మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌

ఇదీ చదవండి:

మర్రిమేకలపల్లిలో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details