ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తన తండ్రి బండ్రెడ్డి తిరుపతిరావునాయుడు జ్ఞాపకార్థం సొంత గ్రామం మట్టపర్రులో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రారంభించారు. రూ.18 లక్షలతో సుకుమార్ ఈ భవనాన్ని నిర్మిచారు. తాను పుట్టిన గ్రామానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాన్నని సుకుమార్ తెలిపారు. 74 ఏళ్ల వయసులో కూడా పనిచేసి తమకు ఎటువంటి కష్టం కలగకుండా పెంచిన తన తండ్రి కేవలం జ్ఞాపకం మాత్రమే కాదని తన జీవితమని సుకుమార్ అన్నారు.
ఆయన పేరుమీద సేవాకార్యక్రమాలు చేయడం సంతృప్తినిస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా తయారైన పాఠశాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను చదువుకున్న రోజుల్లో పాఠశాలలోని సమస్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. హిమాలయాల కంటే ఎత్తైన గొప్పతనం సుకుమార్‌కు ఉందని ఎమ్మెల్యే రాపాక కొనియాడారు. పుట్టిన నేలపై దర్శకుడికి ఉన్న ప్రేమను ఆయన అభినందించారు. అనంతరం పాఠశాల తరఫున దర్శకుడు సుకుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు.