తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కనిపించిన ప్రతి కొండను, ఖాళీ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు. లక్షలాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. కొండలను పిండి చేస్తూ మట్టిని, రాళ్లను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కబ్జా చేసిన ప్రాంతాన్ని చదును చేసి ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. ఇదే పరిస్థితి కనబడుతోంది. కిర్లంపూడి మండలం జగపతినగరం కొండలను సైతం ఇక్కడి మాఫియా మింగేస్తోంది.
గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 66/1y లోని 237ఎకరాల ప్రభుత్వ భూమి.. ఇటీవల తరచూ ఆక్రమణలకు గురి అవుతోంది. అక్కడ రాత్రి వేళల్లో యంత్రాలు.. మట్టిని తరలిస్తున్నారు. భూమిని చదును చేస్తూ స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. ఎవరైనా తవ్వకాలు చేపడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.