Illegal Digging Hills in East Godavari: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం సమీపంలో 108 సర్వే నంబర్‌లో ఉన్న కొండ భాగంలో మట్టి నిల్వలు దండిగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తవ్వి తరలించేస్తున్నారు. ఓ నాయకుడికి చెందిన పొలాన్ని లే అవుట్‌గా మార్చేందుకు మట్టి తరలిస్తున్నారని అందుకే అడ్డగోలు తవ్వకాల వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన సుద్ద అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు విచారణ జరిపారు. అక్రమాల నిగ్గు తేల్చి కోటీ 27 లక్షల అపరాధ రుసుం విధించారు. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న భూమిలో తవ్వకాలు సాగడం వివాస్పదంగా మారింది.
రామవరం(ramavaram)లోని 108 సర్వే నెంబరులో 65 ఎకరాల భూమి ఉంది. అందులో 55 ఎకరాలు రైతుల సాగులో ఉండగా మిగిలిన 10 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ఈ భూమిని రాజకీయ అండతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పామాయిల్ తోటల పక్కనున్న కొండను తవ్వి ఆక్రమించే చర్యలు ఊపందుకున్నాయని రైతు సంఘాలు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే 10 ఎకరాల్లో మట్టి తవ్వకాలకు తెరలేపారని ఆక్షేపిస్తున్నారు.