డ్రెడ్జింగ్ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు- వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ Illegal Sand Mining Mafia in Godavari and Krishna Rivers:గోదావరి, కృష్ణా నదులలో పడవ ర్యాంపు పేరుతో డ్రెడ్జింగ్ మాఫియా చెలరేగిపోతోంది. డ్రెడ్జింగ్‌కు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా వంతెనలు, బ్యారేజీలకు సమీపంలో ఉన్న ఇసుకను కూడా తోడేస్తున్నారు. సాధారణంగా పడవ ర్యాంపుల సొసైటీల కూలీలు నది మధ్యలోకి పడవల్లో వెళ్లి భూగర్భం నుంచి ఇసుకను తోడుతుంటారు. ఇలా ఒక ట్రిప్‌లో 10 నుంచి 12 టన్నుల ఇసుకను తోడి ఒడ్డుకు తీసుకొస్తారు. వందలాది మంది కూలీలకు ఇదే జీవనాధారం. కానీ గోదావరి నదికి ఇరువైపులా పడవ ర్యాంపుల ఇసుక వ్యాపారాన్ని దక్కించుకున్న ఓ గుత్తేదారు మాత్రం తవ్వకాలకు విరుద్ధంగా పడవలను డ్రెడ్జింగ్ యంత్రాలతో నదిలోకి పంపిస్తున్నారు. మోటార్ల సాయంతో ఒకే ట్రిప్‌లో 80 నుంచి 100 టన్నుల ఇసుకను తోడేస్తున్నారు.
వైసీపీ నేతల ఖనిజ దోపిడీకి రాజమార్గం- వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం
గోదావరి పరిధిలో కోటిలింగాల, వెంకటనగరం, గాయత్రి, కాతేరుపడవల ర్యాంపులు, ధవళేశ్వరం, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్‌లలో ఈ మాఫియా ఎక్కువగా సాగుతోంది. కృష్ణా నది పరిధిలో అమరావతి మండలం వైకుంఠపురం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం తదితర చోట్ల కూడా అక్కడి వైసీపీ నేతల కనుసన్నల్లోనే డ్రెడ్జింగ్ జరుగుతోంది. సాధారణంగా కూలీలు తెల్లవారుజామున నదిలోకి వెళ్లి ఉదయం 11 గంటల వరకు రెండు ట్రిప్పుల్లో ఇసుక తీసుకొస్తారు. అయితే డ్రెడ్జింగ్ మాఫియా మాత్రం రాత్రి 8 గంటల సమయంలో యంత్రాలతో బోట్లను నదిలోకి పంపించి, తెల్లవారుజామున 3 గంటల వరకు ఇసుకను వెలికి తీస్తున్నారు. భారీ యంత్రాలు కావడంతో ఒకేసారి ఎక్కవగా ఇసుక పడవలోకి వచ్చి చేరుతుంది. దాంతోపాటు పడవలోకి చేరిన నీటిని మరో మోటారు సాయంతో మళ్లీ నదిలోకి వదిలేస్తున్నారు.
కూలీలతో పడవల్లో ఇసుక తెచ్చేందుకు మూడు నెలలకోసారి కలెక్టర్ నేతృత్వంలో కమిటీ అనుమతులు ఇస్తుంది. అంతకు ముందు రివర్ కన్జర్వేటర్ ఇంజినీర్లు, గనుల శాఖ అనుమతులు ఇచ్చాక, చివర్లో జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్ హోదాలో కలెక్టర్ అనుమతులు ఇస్తారు. అయితే డ్రెడ్జింగ్ కాకుండా కూలీలతో మాత్రమే ఇసుక తీయాలి. జిల్లా కలెక్టర్ మొదలుకొని సంబంధిత అధికారులకు ఈ తతంగమంతా తెలిసినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.
బడా కంపెనీకి అనుకూలంగా బీచ్ శాండ్ టెండర్ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు!
గోదావరి ప్రాంతంలో పడవ ర్యాంపుల వ్యాపారాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు నిర్వహిస్తున్నారు. ఆయన నెలకు 11 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లిస్తారని సమాచారం. తన వెనక ఓ కీలక సలహాదారు, కొందరు అమాత్యులు ఉన్నారని అందరికీ ఆయన చెబుతుంటారు. ఆయన నడిపే సిండికేట్‌లో విజయవాడకు చెందిన అధికార పార్టీ యువనేత కూడా భాగస్వామిగా ఉన్నారని అని తెలిసింది. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యదళం సారథిగా ఓ మహిళా అధికారి ఉన్నప్పుడు డ్రెడ్జింగ్ తవ్వకాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఆమె బదిలీ అయ్యాక పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.
సాధారణంగా వంతెనలు, బ్యారేజీలకు 300 మీటర్ల పరిధిలో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ, డ్రెడ్జింగ్ మాఫియా మాత్రం వంతెనల పిల్లర్ల పక్కనే తవ్వేస్తున్నారు. గోదావరిలో రోడ్ కం రైలు వంతెన, గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజీకి ఆనుకొనే తవ్వకాలు సాగుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. ఇష్టానుసారం డ్రెడ్జింగ్‌తో రోడ్ కం రైలు వంతెనకు ముప్పు కలుగుతోందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రైల్వేశాఖ ఇప్పటికే రెండుసార్లు గోదావరి రివర్ కన్జర్వేటర్ అధికారులకు లేఖలు రాసింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. డ్రెడ్జింగ్ వల్ల మత్స్యసంపద కూడా తరిగిపోతోంది. దీంతో తమ పొట్టకొడుతున్నారని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
టెండర్లు ఖరారు కాకుండానే ఇసుక తవ్వకాలు - టెండర్ పెట్టింది సీఎంవోనా?
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్‌తో ఇసుక తవ్వకాలపై రాజమహేంద్రవరానికి చెందిన వంశీ దినేష్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేయగా వెంటనే తవ్వకాలు ఆపేయాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఇసుక తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా సదరు గుత్తేదారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో రాత్రిళ్లు మాత్రమే డ్రెడ్జింగ్ చేయగా, హైకోర్టు ఆదేశాలు తర్వాత మరింత బరితెగించి, పగటి వేళల్లోనూ ఇసుక తోడేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాల కాపీని సదరు వ్యక్తి అన్నిశాఖల అధికారులకు అందించినా ఫలితం లేకుండా పోయింది.