మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సీఐ.. పట్టుకున్న గ్రామస్తులు - మద్యం అక్రమ రవాణా చేస్తున్న సీఐ
అక్రమంగా మద్యం సరఫరా కాకుండా చూడాల్సిన అధికారే తన ప్రైవేట్ అనుచరులతో అక్రమంగా తరలిస్తున్న ఘటన అనపర్తి మండలంలో జరిగింది. ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరిండెంట్ నాగ ప్రభు కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని సీఐని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
![మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సీఐ.. పట్టుకున్న గ్రామస్తులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సీఐ.. పట్టుకున్న గ్రామస్తులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6590236-196-6590236-1585513798235.jpg)
లాక్‌డౌన్ సమయంలో మద్యం అక్రమమార్గాల ద్వారా సరఫరా కాకుండా చూడాల్సిన అధికారే తన ప్రైవేట్ అనుచరులతో అక్రమంగా తరలిస్తున్న ఘటన అనపర్తి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే కుతుకులూరు గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం లాక్‌డౌన్ కారణంగా గత వారంరోజులుగా మూతపడింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ తన అనుచరులను రెండు కార్లలో కుతకులూరు పంపి దుకాణంలో ఉన్న మద్యాన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. అనుమానం వచ్చిన గ్రామస్థులు వారిని ప్రశ్నిస్తున్న సమయంలో అనుచరులు సీఐకి ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ పొంతనలేని సమాధానాలు చెప్పడం, అదే సమయంలో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అక్కడకు చేరుకుని సీఐని ప్రశ్నించటంతో అసలు విషయం బయటపడింది. సీఐ త్రినాథే అక్రమంగా మద్యాన్ని తీసుకెళ్తునట్లు తేలింది. ఈ విషయమై గ్రామస్తులు సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే సూర్యనారయణ అనపర్తి పోలీసులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు ధర్నా చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరిండెంట్ నాగ ప్రభు కుమార్ ఘటనా స్థలానికి వచ్చి సీఐను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.