"యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాక్ కనిపించదు" - central minister kishna reddy said
పాకిస్థాన్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పొరుగు దేశంపై మండిపడ్డారు. వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని దేశంలో లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
ఈసారి యుద్దం వస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ కన్పించదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సమయం వచ్చినపుడు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) సంగతి తేలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జేఎన్టీయూ కాకినాడ ఆడిటోరియంలో 370 ఆర్టికల్ రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనసంఘ్ పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా అని... పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దీని కోసం బలిదానం అయ్యారని అన్నారు. ఆర్టికల్ 370 కారణంగా పాకిస్థాన్‌తో 4 యుద్దాలు జరిగాయని ఇప్పటివరకూ 42వేల మంది ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దును ప్రశ్నించే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాటాకు చప్పుళ్లకు కేంద్ర ప్రభుత్వం భయపడదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని దేశంలో లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. సభ ప్రారంభానికి ముందు ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కిషన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు సోము వీర్రాజు, మాలకొండయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు