39th Day Of Amaravati Farmers Padayatra : అలుపెరుగని సంకల్పం అడుగులై కదులుతుంటే.. గోదావరి ప్రాంతంలో ఊరూవాడ జైఅమరావతి అంటూ నినదిస్తోంది. అవహేళనలు, అవమానాలు భరిస్తూ కదం తొక్కుతున్న రైతులను.. క్షీరాభిషేకాలతో అనపర్తి ప్రజలు గౌరవించారు. దారి పొడవునా ఎదురేగి స్వాగతిస్తూ.. రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
జయహో అమరావతి నినాదాలతో ద్వారపూడి దద్దరిల్లింది. క్షీరాభిషేకాలతో అన్నదాతలకు అనపర్తి అపూర్వ స్వాగతం పలికింది. కష్టాలకు వెరవక మొక్కవోని దీక్షతో యాత్ర చేస్తున్న కర్షకులకు.. కేశవరం కొండంత అండగా నిలిచింది. 39వరోజు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో సాగిన పాదయాత్రకు.. అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేశవరం నుంచి రామవరం వరకు సాగిన యాత్రకు.. మహిళలు, వృద్ధులు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
రాజధాని రైతులు చూపుతున్న పోరాట పటిమ, స్ఫూర్తికి ప్రతీకగా ద్వారపూడిలో 100అడుగుల జాతీయ పతాకంతో ప్రజలు మద్దతు తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనపర్తిలో రైతుల పాదాలకు క్షీరాభిషేకం చేశారు. పాలకపక్ష నాయకులు దాడులతో గాయాలపాలు చేస్తుంటే, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారంటూ.. చెమర్చిన కళ్లతో మహిళా రైతులు హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.
సర్వమతాల రాజధాని అమరావతి అంటూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవులు పాదయాత్రలో స్వామివారి రథాన్ని లాగారు. ఏకైక రాజధానికి జైకొట్టారు. కులం, మతం, ప్రాంతం అంటూ ప్రజల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతున్నా.. రైతులు మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కటై సాగుతున్నారని అభినందించారు. పాదయాత్రలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఎండవేడికి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
అలుపెరగని పోరాటం.. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లుతున్న ద్వారపూడి ఇవీ చదవండి: