పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులతో తన విడిది కార్యాలయం నుంచి బుధవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, రంపచోడవరం సబ్‌కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్వాసిత కాలనీ గురించి ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు.
గత ఏడాది గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలుగ్రామాలు ముంపునకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి నిర్వాసితులను సంబంధిత కాలనీలకు తరలించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్... జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో సమావేశం వివరాలు వెల్లడించి.. పనులు త్వరగా జరగాలని ఆదేశించారు.