ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇటుకెనక ఇటుక పెట్టి... ఇంటినే పైకెత్తి! - rangampeta, East godavari district

ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు... రోడ్డు విస్తరణలో కూల్చేయాల్సిన పరిస్థితి ఎదురైంది ఓ యజమానికి. తన కలల సౌధాన్ని కూల్చడానికి మనసొప్పక.. ఆ ఇంటినే వెనక్కి జరిపే ప్రయత్నానికి పూనుకున్నారు. విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఇటుకెనక ఇటుక పెట్టి...ఇంటినే పైకెత్తి!

By

Published : Jul 10, 2019, 10:45 PM IST

ఇటుకెనక ఇటుక పెట్టి...ఇంటినే పైకెత్తి!

సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. రేయింబవళ్లు కష్టించి, ఎంతో మమకారంతో కట్టుకున్న ఇల్లును ఖాళీ చేయాలంటేనే కష్టంగా భావిస్తుంటారు. అటువంటిది.. అనుబంధం పెనవేసుకున్న ఇంటిని కూల్చివేయాల్సి వస్తే.. యజమాని పడే ఆ బాధ వర్ణణాతీతం. అదే పరిస్థితి ఎదురైంది... తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన రామ్ కుమార్​కు. రోడ్డు విస్తరణలో ఇల్లు కూల్చేయాల్సిందేనని అధికారులు తెలిపారు. ఇంటిని వదులుకోవడం ఇష్టంలేని రామ్ కుమార్... ఎటువంటి పగుళ్లు రాకుండా.. భవనానికి భవనాన్ని తరలించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

రామ్​ కుమార్ 13 ఏళ్ల క్రితం రంగంపేటలో కోటి రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించుకున్నారు. స్థానిక ఏడీబీ రోడ్డు విస్తరణలో ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంటిని కూల్చేయడం ఇష్టం లేక... ఆయన వినూత్న ప్రయత్నం చేశారు. చెన్నై, బెంగళూరు, ముంబయి ప్రాంతాల్లో ఉపయోగిస్తున్న ఓ విధానాన్ని తెలుసుకున్నారు. ఇల్లు పడగొట్టకుండా.... ఉన్న చోటు నుంచి వెనక్కు తరలించేందుకు చెన్నైకు చెందిన ఏజే బిల్డింగ్ లిఫ్టింగ్ సంస్థను సంప్రదించారు.

ఇల్లు పైకెత్తారు

ఇల్లు తరలింపునకు రూ.34 లక్షల ఖర్చుతో ఓ ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజులుగా ఇంటిని వెనక్కి జరుపుతున్నారు. ముందుగా భవనం కింద భాగాన్ని కట్ చేసి జాకీలతో పైకిఎత్తారు. గోడల కింద ఇనుప గడ్డర్లు పెట్టి జాకీలు ఏర్పాటు చేశారు. గోడలకు పగుళ్లు రాకుండా సిమెంట్ ఇటుకలతో తాత్కాలిక గోడలు నిర్మించి దన్ను ఏర్పాటు చేశారు. భవనం వెనక భాగాన ఖాళీ స్థలంలో జరపాల్సినంత మేరకు కాంక్రిట్ పిల్లర్లు నిర్మించారు. భవనానికి కింద, వెనుక, ముందు చక్రాలు ఉండే జాకీలను పెట్టారు. అవి దొర్లడానికి ఇనుప రేకులను ఉంచారు. ముందు భాగంలో నిర్మించిన గోడల మధ్య వేసిన ఇనుప గడ్డర్లకు పెద్ద జాకీలు అడ్డంగా వేసి భవనం వెనకకు జరుపుతున్నారు.

భవనం 33 అడుగుల మేర వెనక్కు జరపాల్సిఉండగా...ప్రస్తుతానికి 10 అడుగులు జరిపారు. ఇంటికి ఎటువంటి పగుళ్లు రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రామ్ కుమార్ కుటుంబం.. ఆ భవనం పైభాగంలోనే నివాసం ఉంటోంది. మరికొద్ది రోజుల్లో భవనం తరలింపు పూర్తి అవుతుందని రామ్ అంటున్నారు. తన ఇల్లు సురక్షితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : రోగులకు అందుబాటులో...431 అత్యవసర ఔషధాలు

ABOUT THE AUTHOR

...view details