తనయుడికి గుండె శస్త్రచికిత్స కోసం దాచుకున్న లక్షలాది రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయంటూ.. తల్లిదండ్రులు పడుతున్న వేదన.. వర్ణనాతీతంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన చిన్న రాజు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో.. రెండో కుమారుడు శివ రామకృష్ణకు పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉన్నాయి. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు ఆ దంపతులు. కష్టమైనా... లక్షలాది రూపాయలు వెచ్చించి కుమారుడుకి ఒకసారి శస్త్రచికిత్స చేయించారు.
మళ్లీ శివ రామకృష్ణ నీరసించిపోయిన కారణంగా పరీక్షించిన వైద్యులు.. మరో శస్త్రచికిత్స అవసరం అన్నారు. వ్యవసాయ కూలీ అయిన చిన్న రాజు.. తన కుమారుడి కోసం కష్టించి మరీ.. నాలుగు లక్షలు రూపాయలు కూడబెట్టాడు. మరోసారి కుమారుడికి అపరేషన్ చేయించేందుకు సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లంతా కాలిపోయింది. కుమారుడి వైద్యం కోసం దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆ దంపతులు కోరుకుంటున్నారు. తమ కుమారుడిని రక్షించాలంటూ వేడుకుంటున్నారు.