తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఠాణాలో ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో నిందితులు, వైకాపా నాయకులకు హైకోర్టులో ఊరట లభించింది . ఈ కేసులో వారిపై అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న శిరోముండన బాధితుడు ప్రసాద్‌కు నోటీసులు జారీచేసింది.
ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైకాపా నేత కవల కృష్ణమూర్తి , ఆయన అనుచరులు శిరోముండనం చేయించారని బాధితుడు ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు వైకాపా నేత కె . కృష్ణమూర్తి, ఆయన అనుచరులు కె.వెంకటనాగదుర్గ శివప్రసాద్ , కె.వీరబాబు , కె.నాగేంద్రబాబు , ఏ.పుష్కరం, ఏ. భూషణం, ఎస్పై తదితరులపై కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు హైకోర్టును ఆశ్రయించారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని వారు పేర్కొన్నారు.