Heavy Rains in Two Godavari Districts: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల ధాటికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరి వరి పంట నీట మునిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిగ్‌జాం తుపాను రైతులను నట్టేట ముంచింది. భారీ వర్షాలు వరి, అపరాలు, మొక్కజొన్న పంటను వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో కోతకు వచ్చిన వరి పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రగడవరం గ్రామంలో చెరువు పక్కనే ఆరబోసిన ధాన్యం తడిచిపోవడంతో జేసీబీ సాయంతో పక్కకు తీశారు.
తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం జగన్ విఫలం : టీడీపీ నేతలు
యర్రగుంటపల్లిలో చేతికొచ్చిన వేరుశెనగ పంట నీటమునిగిందని రైతులు వాపోయారు. ఉంగుటూరు మండలంలో ధాన్యం రాశులను వరద ముంచెత్తింది. దెందులూరు, కొవ్వలి, పోతునూరు, దోసపాడు, ఉండ్రాజవరం, సత్యనారాయణపురం, కొత్తగూడెం గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సకాలంలో గోనె సంచులు, రవాణా సదుపాయం కల్పించకపోవడంతోనే ధాన్యం నీటిపాలైందని రైతులు మండిపడ్డారు.
"పంట కోసి పది రోజులైంది. సంచుల కోసం తిరిగాము. తేమ శాతం 17 వరకు తగ్గాలని అంటున్నారు. తేమ శాతం తగ్గిన సంచులు అందలేదు. లారీలు అందుబాటులో లేవు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము." -ధాన్యం రైతు