ఉభయగోదావరి జిల్లాలపై.... తీవ్రవాయుగుండం పెనుప్రభావం చూపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు నీరు భారీగా చేరుతోంది. తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలకు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. తమ్మిలేరు నుంచి నీటిని దిగువకు విడుదలతో ఏలూరులో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైఎస్ఆర్ కాలనీ, చాటపర్రు ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరి, పత్తి, మిరప, కూరగాయలు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో నీటి చేరికతో రైతులు భారీగా నష్టపోయారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 48 గ్రామాలకు, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 62 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఉండి పరిధిలో వర్షానికి రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. ద్విచక్రవాహనాలు, కార్ల సైలెన్సర్లలోకి.. నీరు చేరింది. వేలేరుపాడు మండలం కుమ్మరిగూడానికి రాకపోకలు నిలిచాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలింతను.., 108 సిబ్బంది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించి వాహనంలోకి ఎక్కించారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో జలాశయాలకు జలకళ వచ్చింది. కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. సీతపల్లి వాగు వద్ద దుస్తులు ఉతుకుతున్న మహిళ ఉద్ధృతి కారణంగా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. ప్రత్తిపాడు పరిధిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు ముంపునకు గురయ్యాయి.