కోస్తాలో రెండు రోజులుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మన్యం.. తడిసిముద్దయింది. పోలవరం ముంపు మండలాల్లోకి వరద చేరడంతో సహాయ చర్యలకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికార యంత్రాంగం తరలించింది. స్పిల్‌వేలోకి గోదావరి వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు.. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం ఎటపాకలో 93.5 మి.మీ, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 82.25 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలో.. మున్నేరు మీదుగా కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల వంతెనపై 3 అడుగుల మేర నీరు ప్రవహించింది. దీంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లే వాహనాలను అధికారులు పెనుగంచిప్రోలు మీదుగా మళ్లించారు. అనాసాగరం మున్నేటి కాల్వకు గండ్లుపడి వందల ఎకరాల్లో పంట మునిగింది. విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో వాగులుపొంగి 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి.
కోస్తాలో ఎడతెరిపి లేకుండా వాన.. పోలవరంలో నిలిచిన పనులు - గోదావరికి వరద ప్రవాహం న్యూస్
ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు... రాష్ట్రంలో కురుస్తున్న వానలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం అంతకంతకూ.. పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మహోగ్రంగా మారడంతో... రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
19న మరో అల్పపీడనం
ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం శనివారం ఉదయం తీవ్రంగా మారి అక్కడే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో విశాఖపట్నం, ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
జోరుగా కృష్ణమ్మ
బాగల్‌కోటె, సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే : ఆలమట్టి నుంచి 1,08,505 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 1,17,081 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శనివారం సాయంత్రం 71,600 క్యూసెక్కుల నీటిని దిగువన జూరాలకు వదిలారు.
శ్రీశైలానికి జూరాల నుంచి 1,23,504 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2,215, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల వరద వస్తోంది. శనివారం సాయంత్రం జలాశయంలో 136.6026 టీఎంసీల నీటినిల్వ ఉంది. తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో వారం పదిరోజుల్లో శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమగట్టు నుంచి 40,259 క్యూసెక్కులను నాగార్జునసాగ్కు విడుదల చేస్తున్నారు.
స్థానిక వర్షాల ప్రభావమే ఎక్కువ
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదుల్లో వరద పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక నదీ పరీవాహక ప్రాంతాలు, గోదావరిని ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు బాగా పడటం వల్లే ఈ వరద వస్తోందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజిలోకి ప్రవాహాలు పెరగడంతో శనివారం రాత్రి 70 గేట్లు ఎత్తి సుమారు 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం.. శ్రీశైలం జలాశయానికి రాబోయే మూడు రోజుల్లో 80 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల వరకు రావచ్చు, దిగువకు నీటిని తీసుకుంటున్నందున నీటి నిల్వలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. కృష్ణాలో ఎగువ జలాశయాలకు పెద్ద వరద ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:దేశంపై ప్రేమతో ఇంటిలోనే 'ఇండియా మందిర్'